ఇక్కడే కరోనా పరీక్షలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఈ వైరస్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఇక హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానలో నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నది. కరోనా వ్యాధి అనుమానితుల శాంపిల్స్‌ను మహారాష్ట్రలోని పూణెకు పంపడం.. అక్కడనుంచి నివేదికలు రావడానికి ఎక్కువ సమయం పడుతున్నది. దీంతో అన్ని వసతులు ఉన్న గాంధీ దవాఖానలోనే కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే గాంధీలో ఉన్న వసతులు, యంత్ర పరికరాలు వంటి సమాచారంతో వైద్య, ఆరోగ్యశాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు హైదరాబాద్‌లో నిర్వహించేందుకు అనుమతించిన కేంద్రం.. శుక్రవారం అందుకు అవసరమైన కిట్లను పంపనున్నది. దీంతో శనివారం నుంచే గాంధీలో ఈ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నది.